తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. కోరుకొండ మండలం బూరుగుపూడిలో నాగసాయి ఫంక్షన్ హాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీ జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్బంగా ఐదుగురు యువతులు, 13 మంది పురుషులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన కోరుకొండ పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. సీఐ సత్యప్రసాద్ కథనం మేరకు.. ఓ ఫెర్టిలైజర్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోన్న గోపాలకృష్ణ అనే వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన డీలర్స్ కోసం పార్టీ ఏర్పాటు చేశాడు. ఇందుకోసం బూరుగుపూడిలోని నాగసాయి ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు. అతిథుల కోసం మందు, విందు అంటూ గట్టిగానే ప్లా్న్ చేశాడు. వాళ్లకి మరింత ఎంజాయ్‌మెంట్ ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఐదుగురు అమ్మాయిలను రప్పించాడు. వీరంతా పార్టీకి సిద్ధమవుతున్న తరుణంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నుంచి వచ్చిన ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, లోకల్ పోలీసులు అక్కడ దాడి చేశారు. ఈ క్రమంలోనే ఐదుగురు యువతులు, 13 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, సౌండ్ సిస్టం, రూ.61వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.