ఎన్నికల సమయం వస్తుందంటే చాలు అటు రాజకీయ నాయకులతో పాటు ఇటు ప్రజలు తెగ హడావుడి చేస్తుంటారు. ముఖ్యంగా ప్రచార సమయాల్లో నేతలు డబ్బులు పంచడం, ఓటర్లకు మద్యం సీసాలు, బిర్యానీ పొట్లాలు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. వీటిని తీసుకోవడానికి ప్రజలు సైతం పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వార్తలు గతంలో మనం చాలానే చూశం. కొందరు ఓటర్లు అయితే డబ్బులు ఇవ్వమని నేరుగా నేతలను అడగడం కూడా మనకు గుర్తే. కానీ తొలిసారి ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థిక సాయం కావాలంటూ అడిగారు. అందుకోసం ఓ ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పి అందరికీ షాకిచ్చారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దేశరాజధాని ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అయ్యాయి. ప్రచారాల్లో ఇచ్చే హామీలను కూడా ఇప్పటికే రెడీ చేసుకున్నాయి. అయితే తాజాగా ఆప్ సీనియర్ నేత అయిన మనీష్ సిసోడియా ఎక్స్ వేదికగా ఓ షాకింగ్ పోస్టు పెట్టారు. అందులో తాను ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం కావాలంటూ అర్థించారు. అందుకోసం ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించినట్లు వివరించారు.
ఢిల్లీలోని జంగ్‌పుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న మనీష్ సిసోడియా.. ప్రజల మద్దతు వల్లే ఇన్నాళ్లూ గెలిచినట్లు చెప్పుకొచ్చారు. అలాగే ఇక ముందు కూడా వారి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నట్లు తెలిపారు. తనకు ఓట్లు వేయడంతో పాటు డబ్బులు కూడా ఇస్తే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాన్నారు. అయితే ప్రజలు అందించే ఆ డబ్బు ఢిల్లీలోని ఉద్యోగ, విద్యా పురోగతికి ఉపయోగపడుతుందని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం మనీష్ సిసోడియా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రచారాల్లో డబ్బులు పంచేవాళ్లను చూశాం కానీ అడిగే వాళ్లను మిమ్మల్నే చూస్తున్నాం అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మీకు ఓట్లు వేసి గెలిపించడమే కాదు డబ్బులు కూడా ఇస్తామంటూ చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లిన మనీష్ సిసోడియా.. 17 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవలే బెయిల్‌పై విడదుల అయ్యారు. గతంలో పట్పర్‌గంజ్ నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన ఈయన.. ఈసారి మాత్రం జంగ్‌పుర స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో ఈయన విజయం సాధిస్తారా లేదా అనేది.