చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో లైంగిక దాడి ఘటన తమిళనాడును కుదిపేస్తోంది. ఎంకే స్టాలిన్ సర్కారుపై అన్నాడీఎంకే, బీజేపీ సహా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తాజాగా, ఈ అంశంపై తమిళగ వెట్రి కజగం అధినేత, ఇళయ దళపతి నటుడు విజయ్ సంచలన లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాను తమిళ ఆడపడుచులకు ఓ సోదరుడిలా అండగా ఉంటానని విజయ్ హామీ ఇచ్చారు. దేని గురించి ఆందోళన పడొద్దని, అమ్మాయిలు తమ చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
స్టాలిన్ సర్కారుపై కూడా విజయ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ఎవరిని అడగాలని మండిపడ్డారు. ‘ప్రజల భద్రత గురించి మేం ఎవరిని ప్రశ్నించాలి? పాలకులను ఎన్నిసార్లు నిలదీసినా సమాధానం లేదని తెలిసింది. అందుకే ఈ లేఖ’ అని టీవీకే చీఫ్ అన్నారు. ‘విద్యాసంస్థలతో సహా రాష్ట్రంలో రోజూ మహిళలంతా సామూహిక దౌర్జన్యాలకు, లైంగిక నేరాలకు గురవుతున్నారు.. ఓ సోదరుడిగా, ఆప్తుడిగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దారుణాలను చూసి వేదనకు గురవుతున్నాను.. మహిళలకు ఓ సోదరుడిలా అండగా ఉంటా... అమ్మాయిలంతా మీ చదువుపై దృష్టిసారించండి... సురక్షితమైన రాష్ట్రాన్ని సృష్టిస్తాం. అందుకోసం అందరం కలిసి పనిచేద్దాం’ అని విజయ్ రాసుకొచ్చారు.
డిసెంబరు 23న అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై జ్ఞానశేఖరన్ అనే 37 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి తెగబడ్డాడు. అయితే, నిందితుడికి అధికార డీఎంకే పార్టీతో సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అన్నాడీఎంకే దీనిపై ఆందోళనలకు దిగింది. ఇక, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలే తనను తాను కొరడాతో కొట్టుకుని స్వీయదండన విధించుకున్నారు. అంతేకాదు, స్టాలిన్‌ను గద్దె దించే వరకూ తాను చెప్పులు వేసుకోనని ఆయన శపథం చేశారు. నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకుని.. సత్వర న్యాయం చేయాలని విజయ్ డిమాండ్ చేశారు. ‘భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కేసును తీవ్రంగా పరిగణించి.. నేరస్థుడికి తగిన శిక్షను విధించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు.