ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతదేశంలోని ఓ కుగ్రామానికి అమెరికా మాజీ అధ్యక్షుడు పేరు.. ఎందుకు పెట్టారంటే?

international |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 08:47 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్.. 100 ఏళ్ల వయసులో పలు అనారోగ్య సమస్యలతో ఈరోజు కన్నుమూశారు. దీంతో యూఎస్‌లోని ప్రముఖులు అంతా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. అలాగే భారతదేశంలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడికి.. ఇండియాలోని గ్రామస్థులుకు గల సంబంధం ఏంటి, వీళ్లు ఎందుకు ఆయన మృతి పట్ల కన్నీరు పెడుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


1976 అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ గెరాల్డ్ ఫోర్డ్‌ను ఓడించి అధ్యక్ష పదవిని దక్కించుకున్న జిమ్మీ కార్టర్. 1977 నుంచి 1981వ సంవత్సరం వరకు అమెరికా 39వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు భారతదేశంలో 1975లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశానికి ఎమర్జెన్సీ విధించారు. 21 నెలల తర్వాత ఎమర్జెన్సీ ముగియడం.. ఆ తర్వాత జనతా పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఈక్రమంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు అయిన జిమ్మీ కార్టర్ భారత దేశానికి వచ్చారు. అలా ఎమర్జెన్సీ తర్వాత ఇండియాకు వచ్చిన తొలి అమెరికా అధ్యక్షుడిగా రికార్డు సాధించారు.


1978వ సంవత్సరం జనవరి 2వ తేదీన ఇండియాకు వచ్చిన జిమ్మీ కార్టర్.. ప్రజాస్వామం, స్వేచ్ఛపై ప్రసంగాలు చేశారు. ఆర్థికి, సామాజిక పురోగతి సాధించడానికి.. నిరంకుశ పాలనను నిర్ణయాత్మంగా ఖండించిన భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భారతదేశ ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఓటర్లు కల్గిన భారత్... తెలివిగా నాయకుడిని ఎన్నుకోవడంలో సఫలం అయిందంటూ వివరించారు. ఈక్రమంలో ప్రజాస్వామ్యమే గెలిచిందంటూ చెప్పుకొచ్చారు.


ఆ తర్వాతి రోజు జిమ్మీ కార్టర్, అప్పటి భారత ప్రధాని మెరార్జీ దేశాయ్‌లు.. రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసేందుకు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈక్రమంలోనే ఇరు నేతలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఢిల్లీకి సమీపంలోని దౌలత్‌పూర్ నసీరాబాద్ గ్రామాన్ని సందర్శించారు. ఆయన భార్య రోసలిన్‌తో అక్కడకు వెళ్లిన అప్పటి అమెరికా అధ్యక్షుడికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఇది చూసిన జిమ్మీ, ఆయన సతీమణి తెగ సంబుర పడిపోయారు.


అక్కడి ప్రజలతో కలిసి కాసేపు మాట్లాడారు కూడా. ఈక్రమంలోనే ఆ గ్రామానికి జిమ్మీ పేరు పెట్టుకుంటామని అక్కడి ప్రజలు చెప్పారు. అలా ఆయన పేరులోని కార్టర్‌ను ఉపయోగించి.. తమ గ్రామం పేరును కార్టర్‌పురిగా మార్చుకున్నారు. ఇది చూసిన జిమ్మీ కార్టర్ చాలా మురిసిపోయారు. అప్పటి నుంచి అధికారికంగా కూడా నసీరాబాద్ గ్రామాన్ని కార్టర్‌పురిగానే పిలుచుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ప్రస్తుతం జిమ్మీ మృతి విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వల్లే తమ గ్రామం పేరు కార్టర్‌పురిగా మారిందని చెబుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com