చాట్‌జీపీటీ మాతృ సంస్థ ‘ఓపెన్ ఏఐ’పై విమర్శలు చేసిన భారతీయ అమెరికన్ సుచీర్ బాలాజీ (26) అనుమానాస్పద రీతిలో మృతి చెందడం యావత్తు టెక్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా, బాలాజీ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మరణంపై ఎఫ్‌బీఐతో దర్యాప్తు చేపట్టాలని సుచీర్ తల్లి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. బాలాజీది ఆత్మహత్యలా అన్పించడం లేదని ఎలాన్ మస్క్ ఆరోపించారు.
సుచిర్ బాలాజీ నవంబరు 26న శాన్‌ఫ్రాన్సిస్కోలో తాను నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. ప్రాథమిక విచారణలో న్ని ఆత్మహత్యగా పోలీసులు నిర్ధరించారు. కానీ, తన కుమారుడి మృతిపై బాలాజీ తల్లి పూర్ణిమ రామారావు అనుమానాలు వ్యక్తంచేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌ను తాము నియమించుకొని రెండోసారి శవపరీక్ష నిర్వహించామని, పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఫలితాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
‘సుచిర్ అపార్ట్‌మెంట్‌లోకి ఎవరో చొరబడి దోచుకున్నట్లు కన్పిస్తోంది.. బాత్‌రూమ్‌లో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు.. రక్తపు మరకలు ఉన్నాయి.. ఎవరో నా కుమారుడిపై దాడిచేసినట్టు అనిపిస్తోంది. దారుణమైన ఈ హత్యను పోలీసులు ఆత్మహత్యగా నిర్దారించారు. మాకు న్యాయం జరగాలి.. దీనిపై ఎఫ్‌బీఐతో లోతుగా దర్యాప్తు జరిపించాలి’ అని పూర్ణిమ డిమాండ్ చేశారు. ఈ పోస్ట్‌ను ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి, భారత విదేశాంగ శాఖలను ఆమె ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన మస్క్ ‘అది ఆత్మహత్యలా అనిపించడం లేదు’ అని పోస్ట్ చేశారు.
భారత సంతతికి చెందిన టెకీ సుచీర్ బాలాజీ.. నాలుగేళ్ల పాటు ‘ఓపెన్ ఏఐ ’లో రిసెర్చ్‌గా పనిచేసి... ఈ ఏడాది ఆగస్టులో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం ఓపెన్ ఏఐపై తీవ్ర విమర్శలు చేశారు. సమాజానికి ప్రయోజనం కంటే ప్రమాదం కలిగించే సాంకేతికతల అభివృద్ధి కోసం తాను పనిచేయాలని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అలాగే, చాట్‌జీపీటీ అభివృద్ధి సమయంలో సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని బాలాజీ ఆరోపించారు. వ్యక్తులు, ఇతర సంస్థల ఆదాయ అవకాశాలను చాట్‌జీపీటీ, ఇతర చాట్‌బాట్‌లు ధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.