ప్రకృతి అందాలకు, సుసంపన్న సంప్రదాయాలకు నెలవైన గోవా పేరు చెప్పగానే అక్కడ బీచ్‌లు, అందమైన జలపాతాలు, వన్యప్రాణులు గుర్తుకొస్తాయి. అరేబియా సముద్ర తీరంలో 125 కి.మీ. మేర విస్తరించిన గోవా బీచ్‌ల ప్రత్యేకతలే వేరు. సాయంత్రమైతే చాలు, పర్యాటకులకు స్వర్గం కనిపిస్తుంది. మద్యం ప్రియులకు ఇదో స్వర్గధామం. స్వదేశీ బ్రాండ్లతో పాటు విదేశీ మద్యం అక్కడ ధరకే లభిస్తుంది. గోవాకు వెళ్లేవారు తమ వెంట మద్యాన్ని కూడా తెచ్చుకుంటారు. ఇక, 450 ఏళ్ల పాటు పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా పర్యటకంగా ఎంతగానో అభివృద్ధి చెందింది. కొత్త ఏడాది వస్తుందంటే చాలు పర్యటకులు ముఖ్యంగా మద్యం ప్రియులు గోవాలో వాలిపోతుంటారు.
అక్కడ క్రిస్మస్ ముందు నుంచే న్యూఇయర్ మొదలైపోతుంది. బీచ్‌లు, రెస్టారెంట్లు కిటకిటలాడుతాయి. కాలుపెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. అలాంటి గోవాకు ఏమైందో తెలియదు కానీ గత రెండేళ్ల నుంచి పర్యటకులు మొహం చాటేస్తున్నారు. ఈ ఏడాది కూడా పర్యటకులు లేక గోవా బీచ్‌లు, రోడ్లు వెలవెలబోయాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోది. దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే జర్నలిస్ట్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ... ‘పర్యటకులు లేక గోవా దాదాపు ఖాళీగా ఉంది.. ఇది ప్రభుత్వానికి మేల్కొలుపు లాంటింది.. రవాణా గురించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
దీనిని రాకేశ్ కృష్ణన్ సింహ అనే మరో జర్నలిస్ట్ షేర్ చేస్తూ.. ‘మీరు చెప్పింద కరెక్టే దీపిక... ఉత్తర గోవాలో ఉండే నా ఫ్రెండ్ ఫోన్ చేసిన ఇదే విషయం చెప్పాడు... విదేశీయులకు ప్రాధాన్యత ఇస్తూ భారతీయ పర్యటకులను స్థానిక హోటల్స్, వ్యాపారులు అగౌరవిస్తున్నారు.. వారి వైఖరి కారణంగా స్వదేశీ పర్యటకులు గోవాకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు.. గోవాకు దూరంగా మనోహర్ పారికర్ అంతర్జాతీయ విమానాశ్రయం, రత్నగిరి మధ్య ఉన్న బెల్ట్‌లో ఉండేందుకు పర్యటకులు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ధరలు తక్కువగా ఉండటం, స్థానికుల సానుకూల వైఖరితో ఉండటమే కారణం... అందుకే గోవాకు స్వదేశీ పర్యటకులు వీడ్కోలు పలికారు. హోటళ్లలో పరిస్థితి గురించి నా స్నేహితుడు చెప్పడంతో గతేడాది నా గోవా టూర్ రద్దు చేసుకున్నాను.. ’అని అన్నారు.