ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో హామీ ఇచ్చారు. ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తామని తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రజలకు తప్పుడు నీటి బిల్లులు ఇచ్చారని ఆరోపించారు. ఆ నీటి బిల్లును చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారని, తాము అధికారంలోకి రాగానే తప్పుడు బిల్లులను మాఫీ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.ఇక, కాంగ్రెస్, బీజేపీ కలిసి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా..? లేదా అనేది ప్రజలకు చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. లోపాయికార ఒప్పందంతో రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి.. బీజేపీకి ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరో తెలియదు.. ఢిల్లీ అభివృద్ధిపై బీజేపీకి విజన్ లేదు.. ఆమ్ ఆద్మీ పార్టీని దూషించి ఎన్నికల్లో గెలవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది అన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం.. మా పనిని చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. వచ్చే ఐదేళ్లలో ఏ పనులు చేస్తామో కూడా చెప్పి ఓటు అడుగుతున్నాం.. ఇక, ప్రజలు కాంగ్రెస్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.