పోలవరం నిర్వాసితులకు రూ.వెయ్యికోట్ల పరిహారం సొమ్ము పంపిణీలో ఏ విధమైన అవినీతికీ, దళారీ వ్యవస్థకు తావులేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నేరుగా బ్యాంకుల్లోనే జమ చేసేలా నిర్ణయం తీసుకున్నారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు సంక్రాంతి కానుకగా రూ.1,000 కోట్ల పరిహారం సొమ్మును పంపిణీ చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. జగన్ ప్రభుత్వంలో నిర్వాసితులకు పైసా విదల్చలేదని చెప్పారు. పాదయాత్రలో రూ.10లక్షలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో గత ఎన్నికల్లో జగన్‌కు గుణపాఠం చెప్పారన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసి అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమకు గోదావరి జలాలు మళ్లించి తాగు, సాగునీరుగా అందిస్తామని తెలిపారు.