గుంతకల్లు పట్టణంలో కుక్కలబెడద అధికమైంది. అవి రోడ్లపై గుంపులుగా చేరి వచ్చిపోయే వారిపై దాడులకు తెగబడుతున్నాయి. దీంతో రోడ్లపై ఒంటరిగా వెళ్లాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ప్రభుత్వాసుపత్రికి ప్రతి రోజూ పదుల సంఖ్యలో కుక్క కాటు బాధితులు వస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఈ బాధితులు అధికంగానే కనిపిస్తున్నారు. గతంలో మున్సిపాలిటీల్లో వీధి కుక్కల నితంత్రణ చర్యలు చేపట్టేవారు. వాటి సంఖ్య పెరగకుండా ఆపరేషన్లు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ఏటేటా కుక్కల సంఖ్య భారీగా పెరుగుతోంది. అవి గుంపులుగా రోడ్లపై చేరి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఏదైనా సంఘటన జరినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారని, లేకపోతే పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ధర్మవరం గేట్ వద్ద, టీబీ రోడ్డు, కసాపురం రోడ్డు, భాగ్యనగర్, పాతబస్టాండ్‌తోపాటు పలు కాలనీల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. అధికంగా స్కూళ్లకు వెళ్లే పిల్లలు కుక్కకాటుకు గురవుతున్నారు. కుక్కల సమూహం పిల్లలను, ఒంటరిగా వెళ్లే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళలో అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే ద్విచక్రవాహనదారుల వెంట పడుతున్నాయి. వాటిని తప్పించుకునే క్రమంలో వారు రోడ్డు ప్రమాదానికి గురై గాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.