ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజులు (6, 7) పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ రెండు రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం ఉదయం 11.50 గంటలకు ద్రావిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారుల స్వాగతం అనంతరం మధ్యాహ్నం12.00 గంటలకు ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకుని స్వర్ణ కుప్పం విజన్ 2029ను ఆవిష్కరిస్తారు. 2.25 గంటలకు కుప్పం మండలం నడిమూరు గ్రామం చేరుకుని సోలరైజేషన్‌ను ప్రారంభించి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు సీగలపల్లి గ్రామం చేరుకుని ప్రకృతి వ్యవసాయ రైతులతో ముచ్చటిస్తారు. ఈ సందర్బంగా ప్రకృతి వ్యవసాయం విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తారు. ఎన్‌ఓసిఎల్‌తో ఎంవోయూ కుదుర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 5.55 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకుని పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8 గంటలకు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహం చేరుకుని బస చేస్తారు.