విజయవాడలో ఇవాళ(సోమవారం) మరోసారి లయోలా కాలేజ్ వాకర్స్ నిరసన చేపట్టారు. మూడు వేల మందికి పైగా లయోలా వాకర్స్ క్లబ్ అసోసియేషన్‌గా ఉందని.. తమను కాలేజీలోకి అనుమతించాలంటూ వాకర్స్ ఆందోళనకు దిగారు. గత 25 సంవత్సరాలుగా తాము కాలేజ్‌లో వాకింగ్ చేస్తున్నామని.. ఇప్పుడు కాదంటే ఎలా అని ప్రశ్నించారు. అయితే గతంలో కోవిడ్ సమయంలో వాకర్స్‌ను కాలేజ్‌లో వాకింగ్ చేయకుండా కాలేజ్ యాజమాన్యం నిలిపివేసింది. అప్పటి నుంచి తమకు వాకింగ్ చేయడానికి సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాకర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రజాప్రతినిధులకు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆందోళనకు దిగారు.కాగా.. మరోసారి వాకర్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. నిన్న(ఆదివారం) లయోలా కాలేజ్‌లోకి అనుమతించినట్లే అనుమతించి ఈరోజు కళాశాల గేట్లను యాజమాన్యం మూసివేసింది. కళాశాల యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కళాశాల గేట్ ఎదురుగా వాహనాలను అడ్డుపెట్టి వాకర్స్ ఆందోళనకు దిగారు. అధికారుల ఆదేశాలను లయోలా కళాశాల యాజమాన్యం బేఖాతర్ చేస్తోందని మండిపడ్డారు. ఈరోజు సమస్య పరిష్కారమయ్యే వరకు తాము వెళ్లేది లేదని వాకర్స్ నిరసననకు దిగారు. గేట్ల వద్ద వాకర్స్ ఆందోళనకు దిగటంతో కళాశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం కూడా ఈ సమస్యపై కాలేజ్ యాజమాన్యంతో విజయవాడ సీపీ చర్చించారు. అయితే కాలేజ్ యాజమాన్యంతో చర్చించిన తర్వాత వాకర్స్ నడుచుకోవచ్చని చెప్పారు. దీంతో లయోలా కాలేజ్ వాకర్స్ ఆందోళన విరమించారు. సీపీ ఆదేశాలతో ఆదివారం కాలేజ్‌లోకి వాకర్స్‌ను అనుమతించారు. మళ్లీ ఈరోజు కాలేజ్‌లోకి యాజమాన్యం అనుమతించకపోవడంతో మరోసారి వాకర్స్ ఆందోళనకు దిగారు. తక్షణం కళాశాల గేట్లు తెరవాలని వాకర్స్ డిమాండ్ చేశారు. లయోలా కాలేజ్ వద్ద వాకర్స్ ఆందోళనకు దిగడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వాకర్స్‌ను లోపలికి అనుమతించకపోవడంతో కళాశాల గేట్ల వద్ద కార్లు అడ్డుపెట్టి ఆందోళనకు దిగారు. కాలేజ్‌కు వచ్చే విద్యార్థులను సైతం లోనికి వెళ్లనీయకుండా వాకర్స్ అడ్డుకున్నారు. లయోలా కాలేజ్ యాజమాన్యంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్చలకు దిగారు.