అనంతపురం జిల్లాలో బోగస్ పింఛన్ల ఏరివేతపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తప్పుడు సదరం సర్టిఫికెట్లతో పింఛన్లు పొందుతున్న వారిపై ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఫిర్యాదులు అందాయి. దీంతో హెల్త్, దివ్యాంగుల విభాగాల్లోని పింఛన్లను క్షేత్రస్థాయిలో అధికారుల బృందం పరిశీలించనుంది. తొలి విడతగా జిల్లాలో 2,499మంది పింఛనదారులను పరిశీలించనున్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 35వేలకు పైగా అనర్హులు పింఛన పొందుతున్నట్లు సమాచారం. అక్రమ పింఛనదారులకు అడ్డుకట్ట వేస్తే ప్రభుత్వానికి నెలకు సుమారు రూ.20కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా. ప్రస్తుతం మంచానికే పరిమితమైన పింఛనదారుల కేటగిరీలో సోమవారం నుంచి వెరిఫికేషన చేయనున్నారు. దీంతో అక్రమ మార్గాల్లో పింఛన తీసుకుంటున్న వారిలో గుబులు రేగుతోంది.