రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. అయితే ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. యువకుల మృతి బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని చెప్పారు. గత ఏదేళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నామని అన్నారు.ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని అన్నారు. ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ బైక్ మీద వెళ్తుండగా వాహనం ఢీ కొట్టడంతో ప్రాణాలు విడిచారని చెప్పారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు అని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదన్నారు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు అని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టిందని తెలిపారు.ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారని అన్నారు.ఇళ్లకు సురక్షితంగా వెళ్లాలని ఆ వేడుకలో విజ్ఞప్తి చేశానని చెప్పారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.