బీజేపీ నాయకురాలు, సీనీ నటి మాధవీ లత గురించి ఆవేశంలో అలా మాట్లాడానని, ఆమెను కించపరిచే ఉద్దేశం తనకు లేదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ పార్కులో గత ఏడాది డిసెంబరు 31న నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై బీజేపీ నాయకురాలు సాధినేని యామినీశర్మ, సినీ నటి మాధవీ లత చేసిన కామెంట్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఆయన అభ్యంతరకరమైన భాష వాడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో తాడిపత్రిలోని తన నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆ అంశంపై స్పందించారు. తన వయసు 72 ఏళ్లు అని, కొంత ఆవేశంలో మాట్లాడానే తప్ప ఆమెను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ తరఫున తన ఒక్క మున్సిపాలిటీనే గెలిపించిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. కొంతమంది తనను పార్టీ మారమని సూచిస్తున్నారని, వారికి ఆ హక్కు లేదని అన్నారు. తన గురించి అలా మాట్లాడే నాయకులు ఫ్లెక్సీగాళ్లేనని అన్నారు. అభివృద్ధి అంటే వారికి తెలియదని, మొన్న జరిగిన ఎన్నికల వరకు కనీసం వారు ఎవరో కూడా ఎవరికీ తెలియదని అన్నారు. పదవి ఉన్నప్పుడే మాట్లాడుతారని, పదవి పోయిన తర్వాత వారిని పలకరించేవారు ఉండరని ఎద్దేవా చేశారు.