చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులేనని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తిరుపతిలో తొక్కిసలాట జరిగిందని, గతంలో కూడా చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడుతూ...... తిరుపతి తొక్కిసలాట ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనపడుతున్నా, ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా తక్కువ చేసి చూపి, చేతులు దులిపేసుకునే కుట్ర జరుగుతోందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఆక్షేపించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజుల స్వామి వారి దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలి వస్తారని తెలిసినా, టోకెన్ల జారీలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే తొక్కిసలాటలు జరిగాయని ఆమె వెల్లడించారు. గేమ్ చేంజర్ ఈమెంట్ నిర్వహణలో ఉన్న చిత్తశుద్ధి కూడా భక్తుల విషయంలో ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా నమోదు చేసిన బీఎన్‌ఎస్–194 సెక్షన్‌ను మార్చి బీఎన్‌ఎస్–105 కింద కేసులు నమోదు చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రోజా డిమాండ్ చేశారు.