పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లుథియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగీ (58) శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగీకి.. బుల్లెట్ గాయాలు అయ్యాయని.. ఆయనను డీఎంసీ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన తలలో రెండు బుల్లెట్‌లు ఉన్నాయని అధికారులు గుర్తించారు.
అయితే గుర్‌ప్రీత్ గోగీ.. తుపాకీ ప్రమాదవశాత్తు పేలినట్లు ఆయన కుటుంబ సభ్యులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ కుల్దీప్ సింగ్ చాహల్ వెల్లడించారు. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన గుర్‌ప్రీత్ గోగీ.. లుథియానా నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యే మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనా లేక ఎవరైనా అతనిపై కాల్పులు జరిపారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం.. రాత్రి 12 గంటల సమయంలో తన ఇంట్లో లైసెన్స్ కలిగి ఉన్న ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతోనే బుల్లెట్లు తలలోకి దూసుకెళ్లి మరణించారని చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే డీసీపీ జితేంద్ర జోర్వాల్, పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్ డీఎంసీ ఆస్పత్రికి వెళ్లారు. పోస్టుమార్టం తర్వాత ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంత్ బల్వీర్ సింగ్ సీచెహల్‌ను.. శుక్రవారం గోగి కలవడంతోపాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆప్‌లో చేరకముందు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు గుర్‌ప్రీత్ గోగీ పీఎస్ఐఈసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అతను 2014 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. గురుప్రీత్ గోగి మృతి వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని.. పంజాబ్ మంత్రి హర్దీప్ సింగ్ ముండియన్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు గోగి మరణం తీరనినష్టమని పేర్కొన్నారు. గోగి తనకు అన్న లాంటివాడని మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు.