ఒడిశా ప్రభుత్వం తాజాగా అదిరిపోయే పింఛన్ పథకాన్ని తీసుకు వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో అప్పట్లో జైలుకు వెళ్లిన వారికి నెలకు 20 వేల రూపాయల పింఛన్ అందించబోతున్నట్లు సోమవారం రోజు ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి తీసుకు వస్తున్నట్లు వివరించింది. అసలు జైలుకు వెళ్లిన వారికి ఇంత మొత్తంలో పెన్షన్ ఏంటి.. వారెందుకు జైలుకు వెళ్లారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1975 జూన్ 25వ తేదీన అప్పటి భారత దేశ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 1977 మార్చి 21వ తేదీ వరకు ఈ ఎమర్జెన్సీని కొనసాగించారు. అయితే అప్పుడు ప్రభుత్వానికి, ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎవరైతే జైల్లకు వెళ్లారో వారే ఈ పథకానికి అర్హులు అని వివరించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది అప్పట్లో జైలుకు వెళ్లగా.. ఒడిశా నుంచి కొంది వందల మంది ఆ పోరాటంలో పాల్గొన్నారు. జైలు జీవితన్నాని అనుభవించారు. అయితే జైలుకు వెళ్లి ఇప్పటికీ ప్రాణాలతో ఉన్న వారికి ఒడిశా సర్కారు నెలకు 20 వేల రూపాయల పింఛన్ అందించేందుకు సిద్ధం అయింది.
జనవరి 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు.. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈరోజు వెల్లడించారు. పింఛన్‌తో పాటు వారి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈనెల 2వ తేదీన ఈ పింఛన్‌కు సంబంధించిన డిక్లరేషన్ విడుదల చేసిన సీఎం.. ఈరోజు అధికారిక ప్రకటన ఇచ్చారు. ముఖ్యంగా అర్హులైన ప్రతీ ఒక్కరూ పెన్షన్‌తో పాటు వైద్య ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
ముఖ్యంగా ఒడిశాలోని ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీలు.. అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తాయని సీఎం వెల్లడిచారు. ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల కోసం.. ఆరోగ్య శాఖ ప్రణాళికను రూపొందిస్తుందని తెలిపారు. అలాగే లబ్ధిదారులు దేశ వ్యతిరేక కార్యకలాపాలు లేదా నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించినా, న్యాయస్థానం ద్వారా శిక్ష పడినా ప్రయోజనాలను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు.
తప్పుడు పత్రాలు సృష్టించి ప్రయోజనాలు పొందినా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. తప్పుడు పత్రాల వల్ల పింఛన్ పొంది.. తర్వాత దొరికితే ఏడాదికి 12 శాతం వడ్డీతో తిరిగి డబ్బులు కట్టించుకుంటామని కూడా వివరించారు. ఎమర్జెన్సీ సమయంలో శిక్ష అనుభవించిన వారికి పెన్షన్లు అందించడం ఒడిశానే ప్రారంభించలేదు. అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి వాళ్లకు పింఛన్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా హర్యానా, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, అస్సాంలలో ఎమర్జెన్సీ పెన్షన్ పథకం నడుస్తోంది.