ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నలుగురు పిల్లలను కంటే రూ. లక్ష.. దంపతులకు బ్రాహ్మణ బోర్డు బంపరాఫర్

national |  Suryaa Desk  | Published : Mon, Jan 13, 2025, 08:48 PM

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పరశురామ్‌ కళ్యాణ్‌ బోర్డు తాజాగా చేసిన ఓ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బ్రాహ్మణ వర్గంలో రోజురోజుకూ జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తమ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని బ్రాహ్మణ జంటలకు పరశురామ్ కళ్యాణ్ బోర్డు పిలుపునిచ్చింది. ఎవరైతే బ్రాహ్మణ దంపతులు నలుగురు పిల్లలకు జన్మనిస్తారో వారికి లక్ష రూపాయలు నజరానా ఇస్తామని ఆ బోర్డు తాజాగా ప్రకటించింది.


మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్‌ కళ్యాణ్‌ బోర్డు అధ్యక్షుడు పండిత్‌ విష్ణు రాజోరియా వెల్లడించారు. అందరం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశామని.. ప్రస్తుత కాలంలో చాలా మంది యువత ఒకరే సంతానంతో పిల్లలు కనడం ఆపేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా సమస్యగా మారుతోందని వాపోయారు. భవిష్యత్‌ తరాలను కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉందని.. అందుకే ప్రతీ జంటకు కనీసం నలుగురు సంతానం ఉండాలని కోరుతున్నట్లు పండిత్ విష్ణు రాజోరియా తెలిపారు.


నలుగురు పిల్లల్ని కనే మహిళలకు పరశురామ్ కళ్యాణ్ బోర్డు తరఫున రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని పండిత్ విష్ణు రాజోరియా వెల్లడించారు. తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ నగదు రివార్డు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.


ప్రస్తుతం పిల్లలను చదివించడం అనేది చాలా ఖర్చుతో కూడుకుని ఉందని చాలా మంది తనతో చెబుతుంటారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏదోఒకలా పిల్లలను చదివించుకోవాలని.. ఖర్చు భయంతో పిల్లలను కనడం ఆపవద్దని పండిత్ విష్ణు రాజోరియా సూచించారు. అయితే పిల్లలను కనడంలో అలసత్వం వహించొద్దని యువ జంటలకు సూచించారు. మతోన్మాదులు ఈ దేశాన్ని ఆక్రమించుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరించారు. యువతపై తనకు చాలా ఆశలు ఉన్నాయని.. వయసుపైబడిన వారిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేమని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత రాజోరియా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రకటన పూర్తిగా తన వ్యక్తిగతం అని.. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. బ్రాహ్మణ కులానికి సంబంధించిన కార్యక్రమంలో తాను ఈ ప్రకటన చేశానని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com