సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నమెంట్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 18 నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తొలుత 150 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తామని వెల్లడించారు. ఇకపై ప్రజలకు చేతిలోని సెల్ ఫోనే ఆయుధమన్న చంద్రబాబు.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు.
కుల ధ్రువీకరణ పత్రం, పుట్టినరోజు ధ్రువీకరణ పత్రం, అడంగల్, నేటివిటీ వంటి సర్టిఫికేట్లను వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో గవర్నమెంట్ ఆఫీసుల వద్దకు వెళ్లాల్సిన పని ఉండదని.. అలాగే సమయం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు చెప్పారు. నారావారిపల్లెలో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయిన చంద్రబాబు.. ఈ సందర్భంగా పలు విషయాలను వారితో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటుగా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా వారికి వివరించారు.
మనదేశంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపు అమలు చేశామని.. ఏడాదికి రూ.33 వేలకోట్లు పింఛన్ల కోసం కేటాయించినట్లు చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి.. పేదవాడి ఆకలి తీరుస్తున్నామని, పేదరికం, ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రం కోసం పనిచేస్తున్నామని తెలిపారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, రైతులు, కాంట్రాక్టర్లు ఇలా అన్ని వర్గాలకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.6700 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తిరుచానూరులో పైప్లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా ప్రారంభించామని, రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోనూ ఈ రకమైన కార్యక్రమం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు కూడా కట్టుబడి ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.