దావోస్ పర్యటనకు ఈసారి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా ఎటువంటి పెట్టుబడుల ఒప్పందాలు లేకుండా ఏపీ బృందం రిక్త హస్తాలతో వెనుదిరిగింది అని వైసీపీ నేతలు తెలియజేసారు. వారు మాట్లాడుతూ.... మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. రిలయన్స్, ఎల్ అండ్ టీ, అమెజాన్, వర్థన్ లిథియం, జేఎస్‌డబ్ల్యూ, టాటా తదితర దిగ్గజ సంస్థలు మహారాష్ట్రలో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని, నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని, 1995 నుంచి దావోస్‌కు వెళుతున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా ఆకర్షించలేకపోయారు. మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్‌గేట్స్‌తో సమావేశమై ఆ ఫోటోను ఎల్లో మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అసలు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు, బిల్‌గేట్స్‌కు ఇప్పుడు సంబంధం లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ పత్రికలు బాకాలూదాయి అని అన్నారు.