రెడ్ క్రాస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి వైయస్ఆర్సీపీ సానుభూతి పరులను తొలగించే అధికారం కలెక్టర్‌కు లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రెడ్ క్రాస్ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ఆదేశాలను కలెక్టర్ పాటిస్తున్నారని ఆయన విమర్శించారు. గురువారం ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..... కలెక్టర్ హోదాలో కూర్చొనే అర్హత ఆనంద్ కి ఉందో లేదో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని కాకాణి సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ జాతీయ చైర్మన్ గా బీజేపీ ఎంపీనే ఉన్నారని, రాజకీయ నేతలు ఉండకూడదనే నిబంధన ఎక్కడా లేదన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, రెడ్‌క్రాస్ వివాదాస్పదం కాకూడదనే చైర్మన్ పదవికి చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారని, రెడ్ క్రాస్ విలువ పెంచేలా ఆయన వ్యవహరించారన్నారు. రెడ్ క్రాస్ హాస్పిటల్ అభివృద్ధి చెందడానికి కారకులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అని, ఉచితంగా సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ని మంత్రి నారాయణ వాడుకుని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. మంత్రి నారాయణకి అడ్డుగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని కావాలనే తొలగించారు. రెడ్ క్రాస్ విషయంలో గత కలెక్టర్లకు రాని ఇబ్బంది, ఇప్పుడు కలెక్టర్‌కి ఏమొచ్చిందో అర్థం కావడం లేదు. రెడ్ క్రాస్ ద్వారా టీడీపీ నేతలే సేవల చెయ్యాలనే ఆలోచనలో కలెక్టర్ ఆనంద్ ఉన్నారు. వైయస్ఆర్సీపీ సానుభూతి పరుల సభ్యత్వాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.