డెన్మార్క్ అధీనంలోని గ్రీన్‌లాండ్ కోసం ఆ దేశ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఇద్దరు దేశాధినేతల మధ్య 45 నిమిషాల పాటు ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా గ్రీన్‌లాండ్ విషయమై ఆయన తన అభిప్రాయాన్ని గట్టిగానే వినిపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.ఇప్పటికే ట్రంప్ పలుమార్లు గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయమై ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగింది. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో తాము సీరియస్‌గా ఉన్నట్లు ట్రంప్ చెప్పగా.. దానిని ఫ్రెడెరిక్సన్ తోసిపుచ్చారు. తమకు దానిని విక్రయించడంపై ఎలాంటి ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. ఇక తన ప్రతిపాదనను తిరస్కరించడంతో డెన్మార్క్ ప్రధానితో ట్రంప్ దూకుడుగా మాట్లాడారని, ఒక దశలో బెదిరింపులకు కూడా పాల్పడినట్లు అధికారులు తెలిపారు. డెన్మార్క్‌ను సుంకాలతో శిక్షిస్తామని ఈ ఫోన్‌కాల్‌లో ట్రంప్ హెచ్చరించినట్లు కథనం తెలిపింది. కాగా, డెన్మార్క్‌లో భాగంగా గ్రీన్‌లాండ్ స్వయంప్రతిపత్తి కలిగిన దీవిగా కొనసాగుతోంది. అయితే, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని తన మనసులోని మాటను ట్రంప్ చెప్పడం ఇదే తొలిసారి కాదు. 2016లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఆయన ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గ్రీన్‌లాండ్‌లో రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండడంతో అగ్రరాజ్యం వాటిపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ ఈ ద్వీపం కొనుగోలును ప్రతిపాదించారు. ఏకంగా 100 మిలియన్ డాలర్లు విలువ చేసే బంగారాన్ని ఇచ్చేందుకు ఆఫర్ చేశారు. కానీ, డెన్మార్క్ దానిని తిరస్కరించింది. గ్రీన్‌లాండ్ విక్రయానికి లేదని, భవిష్యత్తులో కూడా అమ్మే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని మ్యూట్ బౌరప్ ఎగిడే ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.