ప్రభుత్వ స్కూళ్లలో చదివించలేక.. ప్రైవేటు స్కూళ్లలో చదువులు కొనలేక.. మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. స్కూలు ఫీజుల మోతకు సంబంధించి.. ఎన్ని సార్లు తీవ్ర విమర్శలు, ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అవుతున్నా.. ఇలాంటి ఘటనలు మాత్రం మారడం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన మూడో తరగతి పిల్లాడి స్కూలు ఫీజుకు సంబంధించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో సామాన్యుల రక్తం తాగుతున్నాయి అనేది అందరూ చెబుతున్న మాటే. ఒక ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి నుంచి ఏడాదికి రూ.2.1 లక్షలు ఫీజుగా వసూలు చేసినట్లు ఉన్న పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన సమాచారం బెంగళూరులోని వాయిస్ ఆఫ్ పేరెంట్స్ అసోసియేషన్ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ పోస్ట్‌లో ట్యూషన్ ఫీజుకు రూ. 1.9 లక్షలు.. వార్షిక రుసుము కింద రూ. 9 వేలు.. ఇంప్రెస్ కింద రూ. 11,449 ఉంది. ఇవన్నీ కలిపి మొత్తం రూ. 2.1 లక్షలుగా ఉంది. ఇప్పుడు బెంగళూరులో మూడో తరగతికి రూ.2.1 లక్షలు వసూలు చేయడంపై సోషల్ మీడియాలో పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
విద్యను ప్రైవేట్ పాఠశాలలు వ్యాపారంగా మార్చుతున్నాయని తల్లిదండ్రుల సంఘం తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30, 19(1)(g) ప్రకారం సంస్థలు పాఠశాలలను స్థాపించే హక్కును కలిగి ఉన్నాయి. ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేయాలని.. స్కూలు ఫీజు స్థిరీకరణ కమిటీలను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల కంటే 3వ తరగతి స్కూలు ఫీజులే ఎక్కువగా ఉన్నాయని మండిపడుతున్నారు.