ఒకప్పుడు ఓదెల ప్రాంతమంతా అడవిగానే ఉండేది. ఈ అరణ్యంలో శివలింగం స్వయంభూగా వెలిసింది. ఈ లింగాన్ని పంకజ మహాముని పూజించేవాడు. రానురాను.. ఈ శివలింగంపై పుట్టు పెరిగింది. తర్వాత లింగం కనిపించకుండా అయింది. కొన్ని ఏళ్ల తర్వాత గ్రామం విస్తరించడంతో ప్రజలు అడవిని చదును చేసి వ్యవసాయం చేసుకున్నారు.
ఒకానొక రోజు చింతకుంట ఓదెలు అనే వ్యక్తి వ్యవసాయం కోసం దున్నుతుండగా నాగలికి ఏదో బలంగా తగిలింది. అంతే, భయంకరంగా పెద్ద శబ్ధం వచ్చింది. ఓదెలు ఇక నీ వంశం నాశించుగాక అని వినిపించిందని చెబుతారు. అయితే జరిగిన పొరబాటును ఓదెలు తెలుసుకుని.. స్వామివారికి మెుక్కుకున్నాడు. తెలియక జరిగిన పొరపాటు అని చెప్పుకొచ్చాడు. మన్నించమని వేడుకున్నాడు.
ఓదెలు నిజాయితీకి మెచ్చిన స్వామివారు.. ఓదెలుకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా.. ఓదెల మల్లికార్జున స్వామికి అవతరిస్తానని చెబుతాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కొలువై భక్తులు కష్టాలను తీరుస్తున్నాడు. తనకు గాయం చేసిన ఓదెలు పేరు మీదుగానే ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంగా పేరు వచ్చింది. అయితే ఇప్పటికీ శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ ఉంటుంది.
ఓదెల మల్లన్న ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతారు. ఇక్కడి శాసనలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
అంతేకాదు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో రామగిరి ఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే మార్గంలో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారని స్థల పురాణం చెబుతుంది. అందుకు ప్రతీకగా స్వామి వారికి దక్షిణ దిశగా.. సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాలు ఉంటాయి. ఆలయానికి తూర్పు దిశగా బంగారు పోచమ్మ, వాయవ్య దిశగా మదన పోచమ్మ ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు కచ్చితంగా అమ్మవార్లను దర్శించుకుంటారు.
ఏటా ఓదెల మల్లన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు ఉంటాయి. మహారుద్రాభిషకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒగ్గు పూజారులు పెద్ద పట్నాలు వేస్తారు. చుట్టు పక్కల గ్రామాల వారు ఈ పట్నాలు వేయించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ బావి లో నీటి మట్టం ఏ కాలం లో నైనా స్థిరంగా ఉంటాయి చెంబుడు నీరు తోడైతే అంతే నీరు ఊరుతుందని అంటుంటారు.
![]() |
![]() |