నేరమయ రాజకీయాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. క్రిమినల్ కేసులు ఉంటే ఉద్యోగాలకే అర్హత ఉండదని... అలాంటప్పుడు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు పార్టీలను ఎలా నడుపుతారని, ప్రజా ప్రతినిధులుగా ఎలా ఉంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వైసీపీకి చెంపపెట్టు అని అన్నారు. హత్యా రాజకీయాల పునాదులపై వైసీపీని జగన్ నిర్మించారని విమర్శించారు. క్రిమినల్ కేసులు ఉన్నవారు పాలకులైతే రాష్ట్రం ఎలా ఉంటుందో గత ఐదేళ్లలో చూశామని ప్రత్తిపాటి అన్నారు. హత్యలు చేసి దర్జాగా పాలన సాగించారని... వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై బురద చల్లారని మండిపడ్డారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేశారని... రాష్ట్రాన్ని అడ్డంగా దోచేసి, అప్పులకుప్పగా మార్చారని దుయ్యబట్టారు. సమాజంలో ఉండటానికే అర్హత లేని వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఏమవుతుందో రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలని సూచించారు.
![]() |
![]() |