వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వంశీ అరెస్టు ఆయన చేసిన కర్మ ఫలం. తప్పు చేసినవారికి ఎప్పటికైనా శిక్షపడుతుంది’ అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘వంశీ అరెస్టు అక్రమం కాదు, సక్రమమే. అన్ని ఆధారాలూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో డీజీపీని కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మమ్ముల్ని డీజీపీ ఆఫీస్ గేట్ కూడా దాటనీయలేదు. వైసీపీ నాయకులను అరెస్టు చేస్తే అక్రమం... మమ్మల్ని చేస్తే సక్రమమా? ‘కీలక కేసుల్లో కూటమి ప్రభుత్వం నిర్లిప్తత’ అన్న అరోపణలు సరికాదు. గత ప్రభుత్వ కక్షసాధింపు విధానాలు కూటమి ప్రభుత్వ వైఖరి కాదు. బాధితులకు అండగా ఉంటూ తప్పు చేసినవారు తప్పించుకోకుండా శిక్షపడేలా చేస్తాం.
విజయనగరం జిల్లాలో 3 నుంచి 6నెలల కాలంలోనే రెండు కేసుల్లో ఫోక్సో చట్టం ప్రకారం శిక్షపడేలా చేశాం. పోలీస్, న్యాయ విభాగాలను సమన్వయం చేసి మరింత వేగంగా శిక్షలను అమలు చేస్తాం. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో క్రైం రేటు 9శాతం తగ్గింది. నిందితులను పట్టుకొని, రిమాండ్‌కు పంపడంలో వేగం పెంచాం. టెక్నాలజీని వినియోగించి కేసులను ఛేదిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటన దురదృష్టకరం. బాధితురాలి తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పాం. యువతికి మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశాం అని తెలిపారు.
![]() |
![]() |