అకాల వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రూ.36.11 కోట్ల విలువైన పలు రకాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పంట కోత దశలోని అరటి, బొప్పాయితోపాటు మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లా పుట్లూరు, యల్లనూరు, యాడికి, శింగనమల మండలాల్లోని 557.20 హెక్టార్లలో రూ.34.82 కోట్ల విలువైన అరటి పంట దెబ్బతింది. అలాగే, 2 హెక్టార్లలో రూ.7.50 లక్షల విలువైన బొప్పాయి, రూ.లక్ష విలువైన మామిడి పంట దెబ్బతిన్నాయి. యల్లనూరు, పుట్లూరు మండలాల్లో 35 హెక్టార్లలో రూ.30.09 లక్షల విలువైన మొక్కజొన్న దెబ్బతింది. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో 110.5 హెక్టార్లలో చేతికొచ్చిన రూ.1.20 కోట్ల విలువైన అరటి పంట దెబ్బతింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో శనివారం రాత్రి దాదాపు గంటపాటు వీచిన ఈదురుగాలులకు వడగండ్లు కూడా తోడవడంతో అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడులు వచ్చే సమయానికి పంట నేలమట్టమైదని రైతులు వాపోతున్నారు. లింగాల మండలంలో దాదాపు 2455 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఉద్యానశాఖ అధికారి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. దాదాపు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామన్నారు. నష్ట నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో వర్షం కురవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
![]() |
![]() |