ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఇంటర్నేషనల్ వర్సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చిన జీఎన్ యూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 08:13 PM

రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU) ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ SEU (GNU)తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జీఎన్ యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి GNU సుమారు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడంతోపాటు 500 మందికి ఉపాధి లభిస్తుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు మద్దతుగా పెట్టుబడి, సాంకేతికత, ప్రణాళిక రూపకల్పన, ఎక్విప్ మెంట్ లలో GNU బలాలను ఉపయోగించుకోవడం ఈ సహకారం లక్ష్యం. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఈ ఒప్పందం మన విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడంతోపాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయని తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న మా ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమని అన్నారు. 2002లో స్థాపించబడిన జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ SEU జార్జియాలో అతిపెద్ద యూనివర్సిటీగా అవతరించడమేగాక, అంతర్జాతీయంగా పేరెన్నికగన్న డైనమిక్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉంది. 1,100 మందికి పైగా నైపుణ్యం కలిగిన అధ్యాపక సిబ్బందిని కలిగి ఉన్న ఈ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన సుమారు 52,500 మంది పూర్వవిద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో స్థిరపడ్డారు. జీఎన్ యూ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 4 ఇంటర్నేషనల్ అక్రిడిటేడెట్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్ తోపాటు పలు అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల కొలాబరేషన్ కలిగి ఉంది. ఫండింగ్ తో కూడిన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ లను కూడా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో జీఎన్ యూ వ్యవస్థాపకుడు, రెక్టార్ డాక్టర్ గియా కావ్టెలిష్విలి, విద్యావ్యవహారాల వైస్ రెక్టార్ ప్రొఫెసర్ జార్జ్ గవ్తాడ్జే, అడ్మినిస్ట్రేటివ్ ఎఫైర్స్ వైస్ రెక్టార్ డాక్టర్ గొడెర్జి బుచాష్విలి, ఫైనాన్స్ అండ్ రిసోర్సెస్ వైస్ రెక్టార్ లెవాన్ కలందరిష్విలి, ఇండియా ఆపరేషన్స్ అండ్ అడ్మిషన్స్ డైరక్టర్ జొన్నలగడ్డ వివేకానంద మూర్తి, ఆత్మీయ ఎడ్యుకేషన్ ఫౌండర్, చైర్మన్ హష్మిక్ వాఘేలా, సిఇఓ చిరాగ్ వాఘేలా, ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవో సాయికాంత్ వర్మ, ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ భరత్ గుప్తా, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com