విశాఖ, కడపలో స్థానిక సంస్థలకు సంబంధించి రాజకీయ వేడి నెలకొంది. విశాఖలో మేయర్ పీఠం చేజిక్కించుకోవడంపై కన్నేసిన కూటమి మేయర్ హరి వెంకటకుమారికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. దాంతో నగర పాలక సంస్థలో బలపరీక్ష అనివార్యమైంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే కూటమికి 64 ఓట్లు కావాలి ప్రస్తుతం ఉన్న బలం దృష్ట్యా మరో నలుగురు కార్పొరేటర్లు కూటమి వైపు వస్తే సరిపోతుంది. అయితే గెలుపు తమదేనని డిప్యూటీ మేయర్ జీఎం శ్రీధర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవతలి పక్షం వైపు వెళ్లిన వారు కూడా మళ్లీ తమ గూటికే రాబోతున్నారని అన్నారు. జగన్, బొత్స, అమర్నాథ్ ల అండదండలతో బలపరీక్షలో తామే నెగ్గబోతున్నామని అన్నారు. అటు కడప జిల్లా పరిషత్ లోనూ ఇదే తరహా సీన్ నెలకొంది. కడప జెడ్పీలో మొత్తం 50 స్థానాలు ఉండగా ప్రస్తుతం వైసీపీ బలం 39గా ఉంది. కడపలో మార్చి 27న జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో, వైసీపీ వర్గం క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ప్రస్తుతానికి తమ వర్గంలో ఉన్న కార్పొరేటర్లను, జెడ్పీమెంబర్లను కాపాడుకోవడంపై దృష్టినిలిపింది. వారిలో కొందరిని ఊటీకి, మరికొందరిని బెంగళూరుకు తరలించినట్టు తెలుస్తోంది. పలువురు కుటుంబ సమేతంగా తరలి వెళ్లినట్టు సమాచారం.
![]() |
![]() |