చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడల్లా పరీక్షల నిర్వహణ గందరగోళంగా ఉంటుందని, ప్రశ్నాపత్రాలు లీకవుతాయని, మాల్ ప్రాక్టీస్ ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో రుజువైందని వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర గుర్తు చేశారు. ఈసారి కూడా చంద్రబాబుగారు సీఎం అయ్యాక గత పది నెలల పాలనలోనూ ఏ మార్పూ కనిపించడం లేదని ఆయన ప్రస్తావించారు. విద్యా శాఖకు సీఎం తనయుడు స్వయంగా మంత్రిగా ఉన్నా, వరసగా జరుగుతున్న పేపర్ లీకేజీల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో రవిచంద్ర ఆక్షేపించారు.పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పరీక్షలు మొదలైన నాటి నుంచి రాష్ట్రంలో పలుచోట్ల మాస్ కాపీయింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. నిన్న (సోమవారం) గణితం పరీక్ష ప్రారంభం కాక మునుపే వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం దర్శనమిచ్చింది. వైయస్‌ఆర్ కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష జరుగుతుండగా ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో వివేకానంద పాఠశాలకు పంపారు. పరీక్ష ప్రారంభం కాక ముందే ప్రైవేటు విద్యాసంస్థలకు పరీక్ష పేపర్లు చేరుతున్నాయంటే అధికారుల నిర్లక్ష్యం, పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించలేని స్థితిలో ఉన్నారని పదేపదే రుజువు అవుతూనే ఉంది. గతంలోనూ అర్ధవార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ఇలాగే లీకై కలకలం రేపినా ప్రభుత్వం ఇంకా మేల్కొనలేదు. చివరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల జరిగిన బీఈడీ పరీక్షల మొదటి సెమిస్టర్ ప్రశ్నాపత్రం కూడా పరీక్ష ప్రారంభం కాక ముందే వాట్సాప్‌లో బయటకు వచ్చింది అని తెలియజేసారు.
![]() |
![]() |