2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ పాలసీ, గత వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలోని లిక్కర్ పాలసీ, తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఈ పదినెలల్లో లిక్కర్ కార్యకలాపాలపై విచారణకు సిద్దంగా ఉన్నామని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. అయన మాట్లాడుతూ.... తెలుగుదేశం హయాంలోనూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ డిస్టలరీలకు ఎక్కువ మొత్తాలను పెంచి చెల్లిస్తున్నారు. ఈ పెంచిన మొత్తాలను తిరిగి మామూళ్లుగా ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు మొత్తం కూటమి నేతల గుప్పిట్లోనే ఉన్నాయి. వేలంలో దక్కించుకున్న మద్యం దుకాణాలను కూడా బెదిరించి, భయపెట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేలు గుంజుకున్నారు. చివరికి గీత కార్మిక సొసైటీలకు ఇచ్చిన దుకాణాలను కూడా లాక్కున్న దుర్మార్గపు పాలన ఈ రాష్ట్రంలో నడుస్తోంది. కిందిస్థాయిలోని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడి వరకు మద్యం ముడుపులు అందుకుంటూనే ఉన్నారనేది వాస్తవం. ఇవ్వన్నీ టీడీపీ పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలకు తెలియవా? అని ప్రశ్నించారు.
![]() |
![]() |