భారత్, పాక్ దేశాల మధ్య ఉన్న కమాన్ వంతెనను 6 ఏళ్ల తర్వాత తొలిసారి తెరవడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతరం మూసివేసిన ఈ కమాన్ వంతెనను.. తాజాగా శనివారం అధికారులు తెరిచారు. భారత్-పాక్ సరిహద్దుల్లో.. రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్రంగా జీలం నదిపై ఉన్న కమాన్ వంతెన తెరవడం ఇప్పుడు గమనార్హం. జీలం నదిలో దూకి ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. వారి మృతదేహాలను తిరిగి బయటికి తీసుకువచ్చేందుకు ఈ కమాన్ వంతెనను తాజాగా తెరిచారు. ఇక ఈ కమాన్ వంతెనను తెరవడం రాజకీయంగానే కాకుండా మానవతా చర్యగా అధికారులు పేర్కొంటున్నారు.
ఈనెల 5వ తేదీన జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని బాస్గ్రాన్, కమల్ కోట్ గ్రామాలకు చెందిన ఓ యువకుడు, యువతి జీలం నదిలో మునిగిపోయినట్లు భారత సైన్యం తెలిపింది. 22 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి మృతదేహాలు జీలం నదిలో నీటి ప్రవాహం ధాటికి భారత సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. అయితే జీలం నదిలో మునిగిపోయిన ఆ యువతీ, యువకుల మృతదేహాలను వెలికి తీసేందుకు ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే మొదటగా యువకుడి మృతదేహం భారత భూభాగం వైపు కనిపించింది.
అయితే ఆ యువకుడి మృతదేహాన్ని వెలికితీసే లోపే నీటి ప్రవాహంలో నియంత్రణ రేఖను దాటి అది అవతలి వైపునకు కొట్టుకుపోయింది. చివరికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్-పీఓకేలోని చినారి సమీపంలో పాక్ భూభాగం వైపు కనిపించింది. అనంతరం ఆ ప్రాంతం నుంచి యువకుడి శవాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక యువతి మృతదేహం కూడా పీఓకేలోనే స్వాధీనం చేసుకున్నారు.
ఆ యువతీ యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న తర్వాత.. వాటిని తిరిగి భారత భూభాగంలోకి తీసుకువచ్చేందుకు ఈ కమాన్ వంతెనను శనివారం తెరిచారు. శాంతి వంతెనగా పిలిచే ఈ కమాన్ వంతెనను మానవతా దృక్పథంతో శనివారం అధికారులు ఓపెన్ చేశారు. ఇద్దరి మృతదేహాలను సజావుగా తీసుకువచ్చేందుకు భారత్-పాక్ సైనిక అధికారులు ఒకరికొకరు సహకరించుకోవడం గమనార్హం.
ఈ కమాన్ వంతెనను 2005లో ప్రారంభించగా.. 2019 ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడుల తర్వాత మూసివేయడంతో రెండు దేశాల మధ్య ఈ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో ఈ కమాన్ వంతెన జమ్మూ కాశ్మీర్, పీఓకే మధ్య ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఉపయోగపడేది. ఇరువైపుల ఉన్న బంధువులు ఒకరినొకరు కలుసుకునేందుకు ఈ కమాన్ వంతెన ద్వారానే ప్రయాణించేవారు.
![]() |
![]() |