మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ అపర గోబెల్స్‌లా మాట్లాడుతున్నారని, మరో మూడేళ్లలో అధికారంలోకి వస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే, ఆయన వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకేనని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. జగన్ మళ్లీ జైలు జీవితం గడపవలసి వస్తుందని స్పష్టం చేశారు. జగన్ పాలనలో పంటలకు బీమా చెల్లించకపోవడంతో రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం గ్రామాల్లో కనీసం రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ఆదుకుంటున్నామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మే నెలలో తల్లికి వందనం, జూన్‌లో అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న పుష్కరాలకు రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక, రాజమండ్రిలో 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగనుందని, ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నితో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. గతంలో వైసీపీ కార్యాలయానికి అధికారులు వెంటనే స్థలం కేటాయించారని, టీడీపీ కార్యాలయానికి స్థలం అడుగుతున్నా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.నియోజకవర్గాల పునర్విభజనపైనా గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ అంశంపై కేంద్రంతో అంతర్గతంగా చర్చిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించకూడదని ఆయన పేర్కొన్నారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఎంతో బాధ్యతగా వ్యవహరించాయని, ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గించడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
![]() |
![]() |