అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు అమెరికా అధికారులు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై దాడి గురించి ఒక గ్రూప్ చాట్‌లో చర్చించారు. అయితే, అనుకోకుండా ఆ గ్రూప్ చాట్‌లో జర్నలిస్ట్ ఉండటంతో రహస్యం లీకయ్యింది. హౌతీ రెబల్స్‌పై దాడుల గురించి మార్చి 15న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ, అట్లాంటిక్ మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్‌బర్గ్ దాడి గురించి ముందుగానే తనకు తెలుసని వెల్లడించాడు. ఈ విషయంపై స్పందించిన వైట్‌హౌస్.. గ్రూప్ చాట్‌లోని సమాచారం నిజమైందేనని, పొరపాటున ఒక నంబర్ యాడ్ అయిందని తెలిపింది.
వైట్‌హౌస్ ప్రకారం.. ‘అధ్యక్షుడు ట్రంప్‌నకు తన జాతీయ భద్రతా బృందంపై పూర్తి నమ్మకం ఉంది. ట్రంప్ ఈ విషయం గురించి తనకు తెలియదని చెప్పారు.. గోల్డ్‌బర్గ్ ఈ సమాచారాన్ని ముందుగా బయటపెట్టి ఉంటే చాలా నష్టం జరిగేది. కానీ, ఆయన అలా చేయలేదు’ అని పేర్కొంది.
హౌతీ దాడులకు సంబంధించిన సమాచారాన్ని గ్రూప్ చాట్‌లో రక్షణ మంత్రి హెగ్‌సెత్ పంపారని గోల్డ్‌బర్గ్ తెలిపారు. దాడి లక్ష్యాలు, వినియోగించే ఆయుధాలు, దాడి చేసే విధానం వంటి వివరాలను కూడా అందులో చర్చించారని పేర్కొన్నారు. హెగ్‌సెత్ పంపిన సమాచారం ప్రకారం.. యెమెన్‌లో మొదటి దాడి మధ్యాహ్నం 1:45 గంటలకు జరుగుతుందని చెప్పారు. అచ్చం అలాగే జరిగింది.
రెండు రోజుల ముందు గ్రూప్ చాట్‌లో చేరిన గోల్డ్‌బర్గ్.. ఈ విషయంపై పనిచేసే అధికారుల గురించి ఇతర ప్రభుత్వ అధికారులు మెసేజ్‌లు పంపారని ఆయన చెప్పారు. మార్చి 14న దాడులపై వాన్స్ సందేహం వ్యక్తం చేస్తూ ‘మళ్లీ ఐరోపాను రక్షించడం నాకు ఇష్టం లేదు’ అని అన్నారు. ఎందుకంటే హౌతీల దాడుల వల్ల అమెరికా కంటే ఐరోపా దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయి.
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్ట్జ్, హెగ్‌సెత్‌లు అమెరికాకు మాత్రమే దాడులు చేసే సామర్థ్యం ఉందని వాదించారు. ఐరోపా దేశాలు ఆయాచితంగా లబ్ది పొందుతున్నాయనే వాన్స్ అభిప్రాయాన్ని హెగ్‌సెత్ కూడా సమర్థించారు. ఇది చాలా దారుణమని ఆయన అన్నారు. "S M" అనే వ్యక్తి (బహుశా ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్) మాట్లాడుతూ.. అమెరికా భారీగా ఖర్చు చేసి సముద్ర మార్గాలను రక్షిస్తోందని, దానికి ప్రతిఫలంగా కొంత ఆర్థిక లాభం పొందాలి’ అని అన్నారు.
కాగా, ఈ భద్రతా లోపంపై డెమొక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెనేట్ మైనారిటీ లీడర్ చక్ షూమర్ మాట్లాడుతూ.. ఇది అత్యంత దారుణమైన సైనిక నిఘా ఉల్లంఘనలలో ఒకటి.. దీనిపై పూర్తి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సెనేటర్ జాక్ రీడ్ కూడా విమర్శలు గుప్పించారు. ‘అధ్యక్షుడు ట్రంప్ క్యాబినెట్ నిర్లక్ష్యం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇది ప్రమాదకరం’ అని అన్నారు.
![]() |
![]() |