త్వరలో జరగబోయే మా దేశ ఎన్నికల్లో భారత్, చైనాలు జోక్యం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయని కెనడా ఇంటెలిజెన్స్ విభాగం సంచలన ఆరోపణలు చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన తరుణంలో కెనడా ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. కెనడాలో ఏప్రిల్ 28న పార్లమెంట్ ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ శక్తులు తమ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కెనడా ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ వన్నేసా లాయిడ్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ‘శత్రు దేశాల ఏజెంట్లు ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికి కృత్రిమ మేధస్సును ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
‘ప్రస్తుత ఎన్నికల్లో కెనడా ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కృత్రిమ మేధ ఆధారిత సాధనాలను ఉపయోగించే అవకాశం ఉంది.. తన ప్రయోజనాలకు ప్రయోజనాలకు అనుకూలమైన కథనాలను ప్రోత్సహించడానికి సోషల్ మీడియాను చైనా వినియోగించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.. మోసపూరిత మార్గాల ద్వారా కెనడాలోని చైనీయులు జాతి, సాంస్కృతిక, మతపరమైన వర్గాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటుంది’ అని లాయిడ్ ఆరోపించారు.
అలాగే, ‘భారత ప్రభుత్వం కూడా కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతోనే ఉంది.. కెనడా కమ్యూనిటీలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో దాని భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నించవచ్చు’ అని కెనడా ఇంటెలిజెన్స్ డిప్యూటీ చీఫ్ ఆరోపించారు. అయితే, కెనడా చేసిన ఆరోపణలను భారత్, చైనాలు తోసిపుచ్చాయి. ఆ దేశం ఆరోపణల్లో కొత్తమే లేదని పేర్కొన్నాయి.
అటు, రష్యా, పాకిస్థాన్‌లపై కూడా లాయిడ్ ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా, న్యూస్ వెబ్‌సైట్‌లలో తన నెట్‌వర్క్ వ్యాప్తికి రష్యా ప్రయత్నిస్తోందని కూడా చెప్పడం గమనార్హం. ‘ఈ ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి కెనడియన్లను లక్ష్యంగా చేసుకుని విదేశీ సమాచార తారుమారు, జోక్యం చేసుకునే కార్యకలాపాలను అవకాశవాదంగా నిర్వహించే అవకాశం ఉంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
కాగా, ఖలీస్థాన్ ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్ హత్యను భారత్‌కు కెనడా అంటగట్టే ప్రయత్నం చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సెప్టెంబరు 2023లో అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి తెరలేచింది. ట్రూడో ఆరోపణలు ఖండించిన న్యూఢిల్లీ.. సమాచారం ఇస్తే దర్యాప్తు చేపడతామని స్పష్టం చేసింది.
![]() |
![]() |