అమెరికాలో ఉన్నతవిద్య, ఉద్యోగం అనేది ప్రపంచ దేశాల్లోని చాలా మంది యువత కల. ఈ కలను సాకారం చేసుకోవడం కోసం ఏటా చాలా మంది విద్యార్థులు అగ్రరాజ్యానికి వెళ్తుంటారు. అయితే, గత కొంతకాలంగా ఈ విద్యార్థి వీసాల (F-1 visa) జారీలో అమెరికా (USA) భారీగా కోత విధిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41 శాతం దరఖాస్తులను తిరస్కరించింది. పదేళ్లతో పోలిస్తే F-1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. 2023-24 సంవత్సరంలో మొత్తం 6.79 లక్షల మంది F-1 వీసా కోసం దరఖాస్తు చేసుకోగా.. వీటిలో 2.79 లక్షలు (41%) తిరస్కరణకు గురయ్యాయి. అంతకు ముందు ఏడాది 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షలు (36%) తిరస్కరణకు గురయ్యాయి.
కాగా, 2024 మొదటి తొమ్మిది నెలల్లో భారతీయులకు జారీ చేసిన విద్యార్థి వీసాల సంఖ్య 2023తో పోలిస్తే 38% తగ్గింది. అయితే, గత దశాబ్దంలో దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ, వీసా తిరస్కరణల శాతం పెరిగింది. పదేళ్ల కిందట అంటే 2014-15లో 8.56 లక్షల మంది ఎఫ్-1 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ, కోవిడ్ ఏడాదిలో (2019-2020)లో అత్యల్పంగా 1.62 లక్షలకు పడిపోయింది. కరోనా వైరస్ మహహ్మారి అదుపులోకి వచ్చిన అనంతరం దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరిగినప్పటికీ, 2023-24లో 3% తగ్గింది. 2022-23లో 6.99 లక్షల నుంచి 2023-24లో 6.79 లక్షలకు తగ్గింది. ఫలితంగా, గత ఆర్థిక సంవత్సరంలో వీసా తిరస్కరణల సంఖ్య (2.79 లక్షలు) కనీసం ఒక దశాబ్దంలోనే అత్యధికంగా నమోదైంది. 2023-24లో మొత్తం 4.01 లక్షలఎఫ్-1 వీసాలు జారీ చేయగా.. అంతకు ముందు ఏడాది 4.45 లక్షలుగా ఉంది.
ఎఫ్-1 వీసా అనేది అమెరికాలోని విద్యా సంస్థల్లో చదువుకునే విదేశీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన నాన్-ఇమ్మిగ్రెంట్ కేటగిరీ. ఈ వీసా జారీ తగ్గింపునకు ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ నిబంధనలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019 నుంచి వీసా డేటాను లెక్కించే విధానంలో మార్పులే కారణమని అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘మునుపటి విధానం వర్క్‌లోడ్ చర్యల లెక్కింపుపై ఆధారపడింది.. ఇది దరఖాస్తుకు లింక్ చేయలేదు.. కొత్త విధానం నిర్దిష్ట రిపోర్టింగ్ వ్యవధిలో వీసా దరఖాస్తు ప్రక్రియ తుది ఫలితాలను మరింత ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది’ అని చెప్పారు.
ఇక, 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు భారతీయులకు 64,008 విద్యార్థి వీసాలు లభించాయి. 2023లో ఇదే కాలంలో 1.03 లక్షలుగా ఉంది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం.. 2023-24లో భారతీయ విద్యార్థుల సంఖ్య చైనీయుల కంటే ఎక్కువగా ఉంది. భారతీయ విద్యార్థులు 3.31 లక్షల మంది ఉన్నట్టు తెలిపింది. అమెరికా విద్యా సంస్థలు ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు- డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే భారతీయులు అధికంగా వెళ్తుంటారు.
![]() |
![]() |