స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు సృష్టించిన అరాచకంపై ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీల దౌర్జన్యాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎందుకు ఈసీ మౌనంగా ఉందని ప్రశ్నించారు. అక్రమాలకు వంతపాడుతున్న అధికారులను కఠినంగా శిక్షించకపోతే ప్రజాస్వామ్యానికే అర్థం లేదని అన్నారు. అయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో గత రెండురోజులుగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా వ్యవహరించాయి. తమకు బలం లేకపోయినప్పటికీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు, అరాచకాలతో పదవులను దక్కించుకునేందుకు తెగబడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంపై వీడియోలతో సహా మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం అయ్యాయి. వైయస్‌ఆర్‌సీపీగా ఈ దారుణాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. అయినా కూడా చట్టవిరుద్దంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇటువంటి దాడులు, దౌర్జన్యాలకు ఈసీ ప్రేక్షకపాత్ర పోషించడం సరికాదు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్యంకు రక్షణ. లేకపోతే ప్రజలకు విశ్వాసం సడలిపోతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో సైతం ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. వైయస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచిన వారికి బలవంతంగా టీడీపీ కండువాలను కప్పి, వారిని తమ పార్టీ వారుగా చెప్పుకునే సిగ్గుచేటు చర్యలకు తెగబడ్డారు అని అన్నారు.
![]() |
![]() |