భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి త్వరలో నూతన అధ్యక్షులు రానున్నారు. ఈ నెలాఖరు నాటికి నూతన అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక దాదాపు పది నెలలుగా పెండింగ్లో ఉంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడిని ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తోంది. వాస్తవానికి మార్చి 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా, పార్లమెంట్ సమావేశాల కారణంగా మరోమారు వాయిదా పడింది.ఇప్పటికే 13 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ముగించి 13 మంది రాష్ట్ర అధ్యక్షులను పార్టీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ సహా మిగతా రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించాయి. పార్టీ నియమావళి ప్రకారం బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే 50 శాతం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలి. అంతకు ముందు బూత్, మండల, జిల్లా స్థాయి ఎన్నికలు జరగాలి.2019 నుంచి జేపీ నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల కారణంగా ఆయన పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో జాతీయ అధ్యక్షుడి ఎన్నికను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అంత సులభం కాదు. అనేక సామాజిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సి ఉన్నందున ఈ కీలక పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు బీజేపీ అగ్రనేతలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.
![]() |
![]() |