కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై అదుపుతప్పిన ఓ కారు డివైడర్ ను ఢీకొని సుమారు పదిహేను పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కారు పల్టీ కొడుతున్న సమయంలో ఒక వ్యక్తి గాల్లోకి ఎగిరి కిందపడడం వీడియోలో కనిపించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడికి సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం బెంగళూరు నుండి యాద్గిరి వెళుతున్న ఒక కారు చల్లకెరె, బళ్లారి మధ్య బొమ్మక్కనహళ్లి మజీదు సమీపంలో ప్రమాదానికి గురైంది. హైవేపై వేగంగా దూసుకెళుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. డివైడర్ ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మౌలా అబ్దుల్ (35), అతడి ఇద్దరు కొడుకులు రహ్మాన్ (15), సమీర్ (10) అక్కడికక్కడే మృతిచెందారు. అబ్దుల్ భార్య సలీమా బేగం (31), తల్లి ఫాతిమా (75), మరొక కుమారుడు హుస్సేన్ లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బళ్లారిలోని విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
![]() |
![]() |