మంత్రి నారా లోకేష్ అధికార గర్వంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ వాపును చూసి తన బలుపుగా నారా లోకేష్ భ్రమపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధరణ ఉన్న వైయస్ జగన్‌ను విమర్శించే అర్హత లోకేష్‌కు లేదని అన్నారు. అయన మాట్లాడుతూ.... వైయస్ జగన్ గురించి మంత్రి నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ప్రకాశంజిల్లా కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్రారంభసభ, మంగళగిరిలో పట్టాల పంపిణీ సందర్భంగా లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తుంటే... కళ్ళు నెత్తికెక్కి, అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నట్లుగా అర్థమవుతోంది. నారా లోకేష్ తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలి. అడ్డదోవలో ఎమ్మెల్సీగా వచ్చి పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ శాఖను భ్రష్టు పట్టించాడు. ఆ తరువాత మంగళగిరిలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. రాష్ట్రం అంతా 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవ్వడానికి లోకేష్ అనుసరించిన విధానమే కారణమంటూ మీ పార్టీలోని నాయకులే విమర్శించారు. తిరిగి 2024లో మంగళగిరిలో నిలబడి గెలిచారు. రాష్ట్రం అంతా 163 సీట్లలో తెలుగుదేశం అభ్యర్ధులు గెలిస్తే, అందులో ఒకరుగా చిట్టి రాజా లోకేష్ గెలిచారు. అదే 2019లో 23 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచినప్పుడు లోకేష్ ఓటమిపాలయ్యాడు. దీనిని బట్టి ఆయన సత్తా ఏమిటో అర్థం చేసుకోవాలి. అటువంటి నారా లోకేష్, మాజీ సీఎం వైయస్ జగన్ గారి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. సీబీజీ ప్లాంట్ ను తీసుకువచ్చింది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే. 2024 ఫిబ్రవరి 14న రిలయన్స్‌తో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ రోజు ఆ ప్లాంట్‌ను తానే తీసుకువచ్చినట్లు నారా లోకేష్ గొప్పలు చెప్పుకుంటున్నాడు. వాస్తవాలను అంగీకరించే ధైర్యం ఆయనకు లేదు. అంత సత్తా ఉంటే దావోస్‌కు వెళ్ళి ఏం తీసుకువచ్చారో ప్రజలకు చెప్పాలి. సీబీజీని అడ్డుకుంటున్నారని లోకేష్ బీరాలు పలుకుతూ, అలా అడ్డుకుంటే వారి పేర్లు రెడ్‌బుక్‌లో ఎక్కిస్తానంటూ హెచ్చరికలు చేస్తున్నాడు అని ఆగ్రహం వ్యక్తపరిచారు.
![]() |
![]() |