గ్రామ పంచాయతీల సమస్యలు వినేందుకు, పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పంచాయతీల సమస్యలపై మంత్రివర్గంలో చర్చించి పరిష్కారానికి అవకాశం ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు. మంగళవారం అరకులో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం నాయకులు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన గ్రామాల సర్పంచులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. విద్యుత్ బిల్లులపై వడ్డీలు వేసి మరీ పంపుతుండడంతో పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయని, మైనర్ పంచాయతీలకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని పునరుద్దరించాలని కోరారు. గత కూటమి ప్రభుత్వంలో విద్యుత్ బిల్లులు కట్టాలని సర్పంచులకు నోటీసులు వచ్చేవని, వైసీపీ హయాంలో విద్యుత్ బిల్లుల పేరిట చెప్పాపెట్టకుండా అకౌంట్లు ఖాళీ చేశారని సర్పంచులు వాపోయారు. గిరిజన గూడెం/తాండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలంటూ అర్జీ సమర్పించారు. గిరిజన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే సాయాన్ని రూ. 5 లక్షలకు పెంచాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి, మౌలిక వసతుల కల్పనపై చర్చించేందుకు గిరిజన గ్రామాల సర్పంచులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు, రాష్ట్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల అంశంలోనూ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, అగ్నికుల క్షత్రియ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ చిలకలపూడి పాపారావు అధ్వర్యంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ జాస్తి వీరాంజనేయులు, అనంతగిరి జెడ్పీటీసీ శ్రీ దీసరి గంగరాజు, గిరిజన గ్రామాలకు చెందిన సర్పంచులు శ్రీ పాంగి సునీత సురేష్, శ్రీమతి పెట్టెలి సునీత, శ్రీ పెట్టలి దాసుబాబు తదితరులు సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీల సమస్యలని వివరించిన వారిలో ఉన్నారు.
![]() |
![]() |