కాపు ఉద్యమ నేత, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీలో చేరతారనే ప్రచారం గత కొద్దికాలంగా జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్‌గా వరుస లేఖస్త్రాలు సంధించడం, టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తుండటంతో.. ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయమనే ఊహాగానాలు వినిపించాయి. అలాగే పలువురు వైసీపీ నేతలు ఆయనను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ క్రమంలో ముద్రగడ వైసీపీలో చేరుతారనే ప్రచారంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ముద్రగడ వైసీపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని తెలిపారు. జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ స్ట్రాటజీతో మాట్లాడుతున్నారని, కాపు ఎమ్మెల్యేలను తిడితే ఆ సామాజికవర్గంలో వ్యతిరేకత వస్తుందనే కారణంతోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పక్కా వ్యూహంతో టార్గెట్ చేశారని ఆరోపించారు. అభిమానులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని పవన్ చూస్తున్నారని విమర్శించారు.
'ముద్రగడ వైసీపీలో చేరతానంటే అందరం ఆహ్వానిస్తాం. సీఎం జగన్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. వైసీపీలో ముద్రగడ చేరితే పార్టీ బలపడుతుంది. ఆయన గొప్ప నాయకుడు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ పనిచేస్తున్నారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదు. ముందస్తు అంటూ వస్తున్న వార్తల్లో అసలు నిజం లేదు. షెడ్యూల్ ప్రకారం లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ముందస్తుకు వెళితే మాకు అడ్వాంటేజ్ ఏముంటుంది?' అని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.