వయసు పెరిగే కొద్దీ మనిషి శరీరంలో సమూల మార్పులు కనిపిస్తుంటాయి. చర్మం ముడతలు పడటం, వెంట్రుకలు తెల్లగా మారడం వంటి మార్పులు వస్తాయి. అయితే, మరణాన్ని తప్పించుకోలేం. కానీ, అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యంతో వయసురీత్యా శరీరంలో వచ్చే మార్పులను మాత్రం తప్పించుకోవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. వయసు పెరుగుతున్నా కొద్ది తమలో వచ్చే మార్పుల విషయంలో చాలా మంది నిరాశకు గురవుతారు. ఈ నిరుత్సాహాన్ని తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. దీని ద్వారా ఆరోగ్యకరంగా, ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. న్యూట్రిషినల్ పిల్స్‌ను ఇవ్వడం ద్వారా మన శరీరంలో కణాల క్షీణతను తగ్గించడం వల్ల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బ్రెయిన్ జాన్సన్ జన్యుపరమైన చికిత్సతో తన వయసు తక్కువగా కనిపించేందుకు కోట్లాది రూపాయలను ఖర్చుచేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో బ్రెయిన్ వయసు తగ్గించేందుకు తాను తీసుకుంటున్న చికిత్సల గురించి వెల్లడించారు. రోజుకు 111 ఔషధాలను తీసుకుంటూ.. చికిత్స పురోగతిని ట్రాక్ చేయడానికి వివిధ ఆరోగ్య పర్యవేక్షణ పరికరాలను కూడా ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. తలపై ఎరుపు కాంతి కోసం, మలం నమూనాలను సేకరించడానికి బేస్ బాల్ టోపీని ధరిస్తానని చెప్పారు. అంతేకాదు, రాత్రిపూట అంగస్తంభనలను పర్యవేక్షించేందుకు పురుషాంగానికి చిన్న జెట్ ప్యాక్‌ను అమర్చి నిద్రపోతానని ఆయన వివరించారు. తన మొత్తం శరీరాన్ని యాంటీ ఏజింగ్ అల్గారిథమ్‌కి మార్చడమే లక్ష్యమని జాన్సన్ పేర్కొన్నారు. శరీర నిర్వహణను అవుట్‌సోర్సింగ్ చేయడం అంటే ‘రాస్కల్ మైండ్’ అని పిలిచే దానిని ఓడించడమని అన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 46 ఏళ్లు కాగా.. అవయవాలు 18 ఏళ్ల యువకుడిలా పనిచేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉదయం 5 గంటల కల్లా నిద్రలేచే జాన్సన్.. 11 గంటలకే లంచ్ పూర్తిచేస్తారు.
డ్రైవింగ్ విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. గంటకు 16 మైళ్ల వేగంతో అత్యంత నెమ్మదిగా తన ఎలక్ట్రిక్ ఆడిని స్వయంగా డ్రైవ్ చేస్తుంటారు. ఇళ్లు దాటి బయటకు వచ్చే ముందు తనకు తానుగా డ్రైవింగ్ మంత్రాన్ని చెప్పుకుంటారు. ‘డ్రైవింగ్ అనేది మనం చేసే అత్యంత ప్రమాదకరమైన పని’ జాన్సన్ చెప్పినట్టు టైమ్ పత్రిక నివేదించింది. యుక్త వయసులో ఉన్న తన కొడుకు రక్తాన్ని ఎక్కించుకున్న జాన్సన్.. రోజుకు 100 కంటే ఎక్కువ సప్లిమెంట్లను తీసుకుంటారు. మొత్తం 30 మంది వైద్యుల బృందం రోజువారీ శరీర కొవ్వు స్కాన్లు, సాధారణ ఎంఆర్ఐలను చేస్తుంది. కొల్లాజెన్, స్పెర్మిడిన్, క్రిటినిన్ వంటి పదార్థాలతో నిండిన గ్రీన్ జెయింట్‌తో రోజును ప్రారంభిస్తారని ఫార్చ్యూన్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జాన్సన్‌పై బ్లూమ్‌బెర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది. ‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్’గా అని పిలిచే ఒక కఠినమైన ప్రణాళిక ద్వారా తిరిగి తన యవ్వనాన్ని పొందేందుకు జాన్సన్ ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. స్కిన్ లేజర్ ట్రీట్‌మెంట్‌తో చర్మం వయసు కూడా 22 ఏళ్లకి తగ్గిపోయింది. శరీరంలోని ఇతర అవయవాలతో పోలిస్తే తన చర్మం చాలా యంగ్‌గా ఉంటుందని జాన్సన్ చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa