ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టంపై 1.5 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్టు ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇవాళ అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో వానలు పడతాయంటున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్లూరి జిల్లాలోని లంబసింగిలో ఏకంగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, చింతపల్లిలో ఎనిమిది డిగ్రీలు, అరకు లోయలో పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. పాడేరు అమ్మవారి పాదాలు వద్ద 8.2, మినుములూరు వద్ద 9.1, పాడేరులో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిగాలులకు తమ రోజువారి కార్యక్రమంలో ఇబ్బందులు పడుతుండగా.. వ్యవసాయ పంటలు ఇంటి తెచ్చుకునే రైతులు పంట కోత నూర్పు సైతం చేసుకోవటానికి అవస్థలు పడుతున్నారు. చింతపల్లి ఏజెన్సీలో మంచు తీవ్రతతో పాటు ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత తగ్గిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత మాత్రమే సూర్యోదయం కావటం సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి పెరుగుతోంది.