అయోధ్యలో దివ్యమైన రామమందిర ప్రాణప్రతిష్ఠ ఘట్టం మరికొద్ది గంటల్లో జరగనుండగా.. హిందూ మత పెద్దలు శంకరాచార్యుల విమర్శలు, కార్యక్రమానికి దూరంగా ఉండాలనే వారి నిర్ణయంపై ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. శంకరాచార్యులు దేశంలోని నాలుగు మూలల్లో నాలుగు మఠాలకు పీఠాధిపతులు. ఉత్తరాన ఉత్తరాఖండ్, తూర్పున ఒడిశా, దక్షిణాన కర్ణాటక, పశ్చిమాన గుజరాత్. ఈ నాలుగు పీఠాధిపతులను హిందూ విశ్వాసాలకు ముఖ్య నాయకులుగా పరిగణిస్తారు.
వీరిలో ఇద్దరు ప్రాణప్రతిష్ఠకు హాజరుకాబోమని ప్రకటించగా.. మిగతా ఇద్దరు శంకరాచార్యులు మాత్రం మౌనంగా ఉన్నారు. పూరీ, జోషీమఠ్ శంకరాచార్యలు తాము ఎందుకు ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదనే కారణాలను వివరించారు. ఆలయ నిర్మాణం పూర్తికాకముందే ప్రాణ ప్రతిష్ట చేయరాదని చెప్పారు. శంకరాచార్యులకు గర్భగుడి వెలుపల సీట్లు కేటాయించగా.. ప్రధాని లోపల ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. ఈ ఘటన రాజకీయ కోణంలో ఉందని ఆరోపించారు.
ఈ వివాదంపై మిశ్రా స్పందిస్తూ... ‘శంకరాచార్యులు ధర్మ గురువులు. నేను ఎవరూ కాదు.. సనాతన ధర్మాన్ని పాటించేవారికి వారు బాధ్యత వహిస్తారు.. అలా చెప్పిన తరువాత, నేను దేశానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను’ అని మిశ్రా అన్నారు. ‘మేము ప్రకటించిన విషయం ఏమిటంటే రామ్ లల్లా బాల రాముడు.. భూతలం (కింది అంతస్తు)లో ఉంటాడు. అందులో గర్భగుడి, ఐదు మండపాలు, ప్రతిమ ఉంటుంది. అది పూర్తయింది’’ అని మిశ్రా వివరించారు.
అసంపూర్తిగా మిగిలి ఉన్నది మొదటి అంతస్తు మాత్రమే అని ఆయన అన్నారు. ‘మొదటి అంతస్తు రామ్ దర్బార్. ఇక్కడే రాజా రామ్ కొలువుదీరుతాడు..సీతా సమేతంగా కూర్చుంటాడు. మొదటి అంతస్తులో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉంటారు’ అని అతను చెప్పారు. అలాగే, సోమవారం నాటి ప్రణాళికను కూడా వెల్లడించారు. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఒక భక్తుడు రాముడి 'దర్శనం' కోసం ఎలా ముందుకు వెళ్తారో దశలవారీగా వివరించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన నృపేంద్ర మిశ్రా.. 2014 నుంచి 2019 వరకూ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో రామమందిర-బాబ్రీ మసీదు వివాదానికి తెరపడింది. దీంతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం కాగా.. మిశ్రా పదవీవిరమణ అనంతరం రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్‌గా 2020లో నియమితులయ్యారు.