భారత ఐటీ ఇండస్ట్రీ విభిన్న పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కొత్తగా వచ్చే ప్రాజెక్టులు తగ్గుతుండటంతో ఇప్పటికే నియామకాలు పెద్ద ఎత్తున ఉండటం లేదన్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని విభాగాల్లో చూస్తే.. కావాల్సిన నిపుణుల లభ్యత కూడా తక్కువగానే ఉంది. కృత్రిమ మేధ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ నిపుణులకు డిమాండ్ ఇప్పుడు పెరుగుతోంది. ఇంకోవైపు.. అమెరికా వంటి దేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నాయి. మన దేశంపై మాత్రం ఇప్పటికిప్పుడు ఇలాంటి ప్రభావం లేదని ఐటీ పరిశ్రమ చెబుతూ వస్తోంది.
ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేస్తే జీతం పెద్దగా పెరగదని ఐటీ నిపుణులు భావిస్తుంటారు. అందుకోసమే.. తరచుగా ఉద్యోగాలు మారేందుకు సిద్ధమవుతుంటారు. సంస్థలు మారినప్పుడల్లా.. 15 నుంచి 20 శాతం వరకు వేతనం పెరిగేలా చూసుకుంటారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లేవు. రిక్రూట్‌మెంట్ పెద్దగా లేకపోవడంతో ఉన్న కంపెనీలోనే కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అధునాతన నైపుణ్యాలు ఉన్న వారికి మాత్రం ఈ బాధ లేదు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ నైపుణ్యాలు ఉన్న వారికి, సంప్రదాయ కోడింగ్‌లో మంచి పట్టు ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
ఐటీ పరిశ్రమలో నియామకాలు తగ్గాయని అంటున్నప్పటికీ .. వాస్తవానికి ఇది 2019 స్థాయిలోనే ఉందని ఐటీ రంగ నిపుణులు వెల్లడించారు. 2020 తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్కువ సంఖ్యలో ఐటీ ఉద్యోగాల కల్పన జరిగింది. తర్వాత మాత్రం క్రమంగా ఇది నెమ్మదించింది. ఎక్కువగా తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్ల) నియామకంపై ప్రభావం కనిపిస్తుండటం గమనించొచ్చు. కృత్రిమ మేధ ఉద్యోగాల్ని సృష్టిస్తోంది తప్ప.. ఉన్న ఉద్యోగాల్ని తగ్గించే స్థాయికి చేరలేదని అన్నారు హెచ్ఆర్ పేరోల్ సేవల సంస్థ 'కేక' సీఈఓ విజయ్ యలమంచిలి. ముఖ్యంగా భారత్‌లో అస్సలు అలాంటి పరిస్థితుల్లేవని అన్నారు. ఏఐ ఆధారంగా పనిచేసే ప్రాంప్ట్ ఇంజినీర్లకు డిమాండ్ పెరుగుతుందని ఈ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు. రానున్న 3-4 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల మందికిపైగా ఉద్యోగాల్ని ఇది సృష్టిస్తుందని చెబుతున్నారు.
>> ప్రస్తుతం ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రతి సంవత్సరం కొత్తగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. వాళ్లు ఇప్పటికే కొత్త తరం సాంకేతికతల్ని నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాత వారికి వీరి నుంచి పోటీ ఎదురవుతోంది. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు వీలైనంత తొందరగా ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే ఐటీ రంగంలో ఉద్యోగాలపై ఒత్తిడిని పెంచుతోంది.