తమిళనాడులోని డిండిగుల్ జిల్లా ఒద్దంఛత్రానికి చెందిన సౌందరపాండి, పసుంగిలి దంపతుల కుమారుడు పండిదురై రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే పండిదురై తన చెల్లెలు ప్రియదర్శినితో పాటు ఆమె పిల్లలపై అమితంగా ప్రేమ చూపించేవాడు. అయితే పండిదురై చనిపోయినప్పటికీ తన అన్నయ్య సమక్షంలోనే తన పిల్లలకు చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహించాలని అతని చెల్లెలు భావించింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని పోలిన సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించారు. వేడుక సందర్భంగా సిలికాన్ విగ్రహానికి పట్టుబట్టలు తొడిగి ముస్తాబు చేశారు. విగ్రహాన్ని రథంపై ఊరేగింపు నిర్వహించారు. విగ్రహం ఒడిలో చిన్నారులను కూర్చోబెట్టి చెవులు కుట్టించారు. ఈ కార్యక్రమం మార్చి 13న ఒద్దంఛత్రం గ్రామంలో జరిగింది. ఈ సిలికాన్ విగ్రహాన్ని బెంగళూరులో రూ.5 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేయించారు.