ఐపీఎల్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఐపీఎల్-2022లో ఆడడం లేదని తెలిసి అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. రూ.2 కోట్ల బేస్ ధరతో ఉన్న రైనాను ఇటీవల వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే చాలా ఫ్రాంచైజీలకు క్రికెటర్లు దూరం అవడంతో వారి స్థానంలో మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సురేష్ రైనా వస్తాడని అంతా ఆశించారు. అయితే అలా కూడా రైనా వచ్చే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. ఈ తరుణంలో విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అవకాశమైనా ఇవ్వాలని బీసీసీఐని రైనా కోరాడు. అనుమతి ఇచ్చేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఇన్ని సమస్యల మధ్య రైనాకు ఐపీఎల్ యాజమాన్యం గుడ్ న్యూస్ అందించింది. రవిశాస్త్రితో కలిసి కామెంటేటర్‌గా అలరించేందుకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. చాలా కాలం పాటు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఆడిన రైనా తాజాగా కొత్తరూపంలో అభిమానులను అలరించనున్నాడు. హిందీలో రైనా, రవిశాస్త్రి కామెంటేటర్లుగా పని చేయనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.