ఒమిక్రాన్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ విజృంభిస్తోందని హెచ్చరించింది. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఎపిడెమిలాజిస్ట్ మరియా వాన్ ఖెర్ఖోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉందని చెప్పి కొన్ని ప్రాంతాల్లో కరోనా నిబంధనలను ఎత్తివేశారని, దీంతో కేసులు పెరుగుతున్నాయని మరియా వెల్లడించారు. వ్యాక్సిన్ల వల్ల వ్యాధి తీవ్రత, ప్రాణాపాయ ముప్పు తగ్గుతుందని, కానీ వైరస్ వ్యాప్తి తగ్గబోదని ఆమె తెలిపారు. చైనాలో గత కొద్ది రోజులుగా గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం మరోసారి ఆంక్షల బాటపట్టింది. ఆ దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది లాక్ డౌన్ లోకి వెళ్లిపోయారు.