పనిచేసే చోట మహిళలకు రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సబల అనే కార్యక్రమాన్ని రూపొందించిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైౖర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సబల కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఈదా ఫౌండేషన్ సౌజన్యంతో గుంటూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాల పరిధిలోని మహిళా ఉద్యోగులతో బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగినుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 63026 66254 అనే వాట్సప్ నెంబరుకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 23న కృష్ణా, 30న రాయలసీమ, 6న ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రాంతీయసదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
మహిళా శిశు సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి ఏఆర్ అనురాధ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని కార్యాలయాల్లో మహిళల రక్షణ కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే మహిళలకు న్యాయం దక్కుతుందని పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్ రాజకుమారి, సైబర్ క్రైమ్ ఎస్పీ జీఆర్ రాధికలు మాట్లాడుతూ మహిళలు కుటుంబ బాధ్యతలను, విధులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం సబల వాట్సప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ప్రభుత్వ సలహాదారు కె. చంద్రశేఖరరెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ ముంతాజ్, డిప్యూటీ మేయర్ సజల, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వివిధ సంఘాల నాయకులు రాజ్యలక్ష్మి, రాధారాణి, సుశీల, అరుణకుమారి, స్రవంతి, మాధవి, తులసిరత్నం, నాగమణి, మల్లె అనురాధనాయుడు తదితరులు పాల్గొన్నారు.